Tuesday, July 10, 2012

వెలుతురు కిరణాలు ( వీరరసం )

           

నీ అంతు  ఇప్పుడే  తేల్చేస్తానంటూ  గురిచూసి గొడ్డలి విసిరాడు  గెరిల్లా యోధుడు. ఎదురుగుండా  గోడ్డంకి  చెట్టునానుకుని  పొంచొన్న  పోలీసుద్యోగి మోకరించి  చూస్తున్నాడు . దూసుకువస్తోంది  గొడ్డలి .  పోలీసాయన పాముని  చూసిన కప్పలాగా నిశ్చలంగా  ఉన్నాడు . ఇద్దరికీ మధ్య ముప్పయి మీటర్ల కన్న ఎక్కువ దూరంలేదు .
 గెరిల్లా యోధుడి  గొడ్డలి నిమిషానికైదుమైళ్ళ   వేగంతో  పోతోంది .

 దేశంలో ,  మాటకొస్తే  ఏ దేశంలోనైనా  చాలామంది ధీరులున్నారు . అంతకుమించి  అనేకరెట్లమంది   పిరికివాళ్లూ ఉన్నారు .

వీరుల్ని గురించి  పిరికివాళ్ళకి ఆచూకీ ఇచ్చేవాళ్ళూ ఉన్నారు . వీరుల నెత్తి మీద  బహుమతి ధనం  ప్రకటించి తమ దారిని నిష్కంటకం  చేసుకోవచ్చునని భ్రమపడే  ప్రభుత్వాలూ ఉన్నాయి . అయినా వీరులు ప్రభవిస్తూనే  ఉంటారు .  ప్రభుత్వాలను  పడగొడుతూనే ఉంటారు . అయితే నిత్యమూ   జరిగే సంఘటన కాదు . అనుదినం జరిగేది ఇలాంటి వీరులు వందల సంఖ్యలో  ఉండడం .

ఒక ఉషస్సు పుట్టాలంటే  ఎన్నోకోట్ల  నక్షత్రాలు  చనిపోవాలన్న కవిమాట  కవిత్వమే కాదు , యథార్థం  కూడా  !
వీరుడి గొడ్డలి  ఒక సెంటీమీటరు  వారలో గురితప్పింది . చెట్టులో చిక్కుకుంది . పోలీసాయన  బతికి బయటపడ్డందుకు  అతనికే ఆశ్చర్యం  వేసింది . మళ్ళీ కరచరణాదులాడుతున్నాయి  .క్షణకాలం  శవంలాగయిపోయిన అతని శరీరంలో  చైతన్యం ప్రవహిస్తోంది .

మూసిన కళ్ళు ఒక్కసారి తెరిచి చూశాడు . వీరుడు  పొదల్లో  మాయమవుతున్నాడు .
పోలీసాఫీసర్  విజిల్ ఊదేడు . రివాల్వ రును సవరించి పొజిషన్లోకి  తెచ్చాడు .
రెండు జీపులలో  వచ్చిన పోలీసు  దళాలు ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టాయి . వీరుడికి గత్యంతరం లేదు . దాగడానికి  పొదలు లేవు .
 పరిగెత్తుతున్న వీరుని  గురిచూసి ఒక పోలీసు జవాను తుపాకీ కాల్చాడు . గుండు గురి తప్పింది . కానీ వీరుడి తొడల్లోకి దూసుకు పోయింది .
వీరుడు పడిపోయాడు .సృహదప్పి మాత్రం కాదు . అతని దగ్గరకు వెళ్లడానికి  అందరూ భయపడుతున్నారు . పోలీసాఫీసర్  కొంచం ధైర్యంచేసి  అల్లంతదూరంనుంచి  వీరుడి రెండవ కాలిమీద రివాల్వారు  పేల్చాడు .

వీరుణ్ణి  జిల్లా హెడ్ క్వార్టర్స్ కి  తీసుకు పోయారు .  ఒక పోలీసు ఠాణా లో నిర్భంధించారు . తర్వాత అతన్ని పెట్టిన చిత్రవధల గురించి  ఇక్కడ రాయను .
చెప్పేను కాదు , ఈ  జరిగిందంతా  మన దేశంలోనే  జరిగిందనుకో నక్కర్లేదు . అనుకునే  వాళ్ళు అనుకోవడానికి నాకు అభ్యంతరం లేదు .
 పారిపోతుండగా  ఒక బందిపోటును కాల్చిచంపడం  జరిగిందని కొన్ని పత్రికలూ , పోలీసులూ ఆత్మరక్షణార్థం  కాల్పులు చేయగా , ఒక దేశద్రోహి  మరణించాడని  కొన్ని పత్రికలూ  ప్రకటించాయి .
వీరుడింకా  బ్రతికే ఉన్నాడు . ఒక ఉన్నత రక్షకభటాధికారి  జైలు సెల్లులో అతన్ని ప్రశ్నిస్తున్నాడు .
నీ పేరేమిటి ?’
మానవుడు
ఓహో అలాగా పశువ్వి అనుకున్నాను . మనిషివే  అన్నమాట . సరే , నీ ఊరేమిటి ?’
ప్రపంచం
అది ఊరి పేరు కాదు. అతి తెలివిగా జవాబు చేప్పడం  మాని , నువ్వే ఊళ్ళో పుట్టావో  ఆ ఊరిపేరు చెప్పు
 ఊరిని మీవాళ్లెప్పుడో నేలమట్టం చేశారు
నేలమట్టం చేయక ముందు దానికో పేరు లేదూ?’
ఉంది ప్రపంచంలో కుగ్రామం ‘
ఇక నిన్ను ప్రశ్నించి లాభంలేదు. ఇదిగో చూడబ్బాయి , నువ్వు కుర్రాడివి . బ్రతికి బాగుపడాల్సిన వాడివి . దేశానికి నీలాంటి యువకులెంతో  అవసరం .  నా మాట విని ...
విని మా రహస్యాలు మీకు చెప్పేస్తేమా వాళ్లందరికి ద్రోహం చేస్తే నాకు మంచి ఉద్యోగం యిస్తారు , నన్ను మీ మార్గంలో  బాగు చేస్తారు . అంతే  కదూ  ?  యూ స్కంక్

ఆరదండాల చేతులు పోలీసు ఉద్యోగి  నెత్తిమీద పడబోయాయి .
ఇలాంటి  అఘాయిత్యం ఏదో జరుగుతుందని అనుకుంటూనే  ఉన్న పోలీసు ప్రముఖుడు  నేర్పుగా  తప్పించుకొన్నాడు . ఇద్దరు జవాన్లను లోనికి రమ్మన్నాడు . పోలీసు స్టేషన్లో  నిర్భండితుణ్ణి  చంపకూడదంటూ  బైటికి తీసుకెళ్లి వీన్ని కాల్చేయండి’ అని  ఆర్డరు వేశాడు .
 పూర్తీగా  చీకట్లు పోని , బాగా  వెలుతురు  రాని సమయం అది . అప్పుడు వీరుడు  సంతోషపూర్వకంగా తుపాకీ గుళ్ళను  స్వీకరించాడు .
  చీకట్లో  అతనికేవో  వెలుతురు కిరణాలు కనిపించాయి . ఆవి  తాను చదువుకొనే  గదిలో పెట్టుకొన్న  మార్క్స్ ,ఎంగెల్స్ , లెనిన్ , స్టాలిన్ , మావోల  వర్ణ చిత్రాలు .
( జ్యోతి మాస పత్రిక ,  మే ,1977)
మహాకవి శ్రీశ్రీ -నవరసాల కథలు