Saturday, January 1, 2011

నూతనసంవత్సరగీతి




ఈ నూతనసంవత్సర శుభాది తరుణాన
ఈ ప్రథమ మాసాన
ఈ మనోజ్ఞ విభాత సమయాన
ఈ మహాంధ్ర జనాళి సుముఖాన

కలతలే తరగలై లేస్తుంటే
కక్షలే గాలులై వీస్తుంటే
కలుష జీమూతాలు మూస్తుంటే
కుట్రలే కుక్కలై కూస్తుంటే

ధరియించి పెదవిపై దరహాసం
భరియించి యెడదలో పరితాపం
విరిచింతు నీనాటి నవగీతం
చిలికింతు విజయాంధ్ర నవనీతం

తెలుగునాడును పెద్ద చౌరాస్తా
నావహించిన పిచ్చి చాదస్తా
లవఘళించే భ్రమలు ఛేదిస్తా
మలుపులన్నీ దిద్ది తీరుస్తా

ఎవరురా ఆ గొప్ప మొనగాళ్ళు
మతిలేని తలకిందు గిజిగాళ్ళు
నాయకుల మనుకునే మగవాళ్ళు
ఐకమత్యం చెరచగలవాళ్లు

తెలుగుతల్లిని పంచుకొంటారా
తెలుగు నెత్తురు నంచుకొంటారా
తెలుగు గొంతుక చించుకొంటారా
తెలుగు తాడే తెంచుకుంటారా

అంతస్సమర భీతి ముట్టించి
అభివృద్ధి పెడదారి పట్టించి
లేనిపోని పుకార్లు పుట్టించి
సత్యానికి సమాధి కట్టించి

ఎవరురా  విరగబడుతున్నోళ్ళు
ఆస్తులు పాస్తులు ఉన్నోళ్ళు
మస్తుగా దేశాన్ని తిన్నోళ్ళు
జరుపుతా రీజులుం ఎన్నాళ్లు

తిరగబడుతున్నారు పేదోల్లు
కూటికి గుడ్డకి లేనోళ్ళు
చదువులూ సాములూ రానోళ్ళు
విప్పుతా రికమీద వేనోళ్ళు


వీళ్ళ కోసం నేను నిలుచుంటా
వీళ్ళ భాధలు నాకు తెలుసంటా
రేపటికి వారసులు వీరంతా
వీళ్ళ ధాటికి ఎదురు లేదంటా

కళింగాంధ్ర త్రిలింగాంధ్రాలు
కాకతీయుల మధురబంధాలు
రాయలేలిన ఏడు సంద్రాలు
రాగానురాగ ప్రబంధాలు

తెలుగు జాతిని శిలువ తీస్తున్న
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న
విశాలాంధ్రను చీల్చ జూస్తున్న
పిచాచాలను తరిమి వేస్తున్నా

మహాకవి శ్రీశ్రీ -మరోప్రస్థానం

0 comments:

Post a Comment