Friday, January 7, 2011

నాడే నేడు



తెల్లవాళ్లు ఇండియాకు 
మేళ్ళెన్నో చేశారని 
చిన్నప్పుడు స్కూళ్ళల్లో 
ఎన్ని చదువలేదు మనం !

సహగమనం ఆ పేరు 
ధగ్గీ పరిమార్చారు 
రైళ్లు టెలి గ్రాఫులు 
వంతెనలు చాలా వేశారు

ఔను వాళ్ళు చాల మేల్లు 
చేయకపోలేదు నిజం ! 
అయినా ఆ దొరతనాన్ని 
అసహ్యించుకొన్నాం కద !

అన్నీ చేసినా కూడా 
తెల్లదొరల నందర్నీ 
గెంటేశాం కద ! 
కంటికి నిదరొచ్చిందా ?

అదే రీతిగా నేడు 
పాలకవర్గం చేసిన 
చేస్తున్న సమస్తాన్ని 
చూస్తూనే వుంది జనం

సమకాలిక పరిపాలక 
చర్యలు సర్కారువారి 
ప్రచార సాధనాలతో 
ప్రాచుర్యం పొందెను కద !

ఇన్ని జరుగుచున్న , మన 
హీనస్థితి మారదు  కదా ! 
ధనశక్తులతో బాటే 
దారిద్యం పెరిగెను కద !

అమ్మడమూ కొనడమనే 
ఈ పద్ధతి కన్నా ఒక 
మంచి వ్యవస్థను చేరే 
మార్గమనుసరించాలి

సమసమాజ నిర్మాణం 
స్వప్నం కాదీనాడు 
మన యెదుటే ఈ లోకం 
మారుతోంది క్షణ క్షణం

తూర్పు దిక్కు మార్పు చెంది 
ఎరుపెక్కిందీనాడు 
సామ్యవాదమే ప్రపంచ 
శక్తియైనదీనాడు

మహాకవి శ్రీశ్రీ -మరోప్రస్థానం 

0 comments:

Post a Comment