Tuesday, January 11, 2011

ఈ సంవత్సరవేళ నేకోరేదింతే


తొలి నుంచి నాకుందొక 
దురలవాటో సదలవాటో 
అనుకున్నది అనుకున్న 
ట్లనేయడం , రాయడమూ 
అదే నేరమయితే నే 
నందుకొప్పుకొంటున్నా 
తెలుగు వాళ్ళ మందరమూ 
కలసి కట్టుగా వుంటే చక్కగా 
జీవిస్తామను సంగతి 
నేనెరిగిందే

మీ దారిన మీరు పొండి 
నా దారిని నాకు వదిలి 
మీరట ప్రజలంటారు 
నేనూ ప్రజలంటాను 
మీ ప్రజకూ నా ప్రజకూ 
పొంతన కుదరదు లెండి

చస్తున్న వ్యవస్త మీది 
వస్తున్న చరిత్ర నాది 
శవాదరణ మీ ధ్యేయం 
శిశూదయం నా న్యాయం 

విప్లవ ఝుంఝూనిలాలు 
వీస్తున్న సంవత్సరాది నేడు 
విప్లవ రణదుంధుభులు ధ్వ 
నిస్తున్న శుభాళి నేడు 

విగతాశులు ప్రగతిమార్గ 
విరోధులకు సమాధి 
విప్లవజన వాహినులు జ
యిస్తున్న ఉగాది 
తెలుగువారి ధీశక్తి 
తెలుగువారి క్రియా శక్తి 
నలుదెసలా రహించాలి 
తెలుగుతనం జయించాలి

ఐదు కోట్ల తెలుగు జాతి 
         హర్షించాలి 
ఆనందం తెలుగునాట 
         వర్షించాలి 
తెలుగువాడి తెలుగు ‘వాడి’ 
          దీపించాలి 
తెలుగునాట తెలుగుపాట 
          వ్యాపించాలి 
తమ గమ్యం తెలుగువాళ్లు 
          చేరాలంతే 
ఈ సంవత్సరవేళ  నేను కోరేదింతే

మహాకవి శ్రీశ్రీ -మరోప్రస్థానం 


0 comments:

Post a Comment