Thursday, August 4, 2011

ఏనుగూ , కుక్కా


అడవి  మృగాల ప్రదర్శనంలో పాల్గొనడానికి 
నడిపించుకు వెళ్ళుతున్నా రొక ఏనుగుని
వేడుక చూడడానికి  వీధులనిండా
పోగయినారు  పనీ పాటా లేని సోమరులు !

కాకతాళీయంగా  ఒక కుక్క వాళ్ళని  చూసింది
ఏనుగును చూస్తూ చిందులేసింది
పెద్ద యుద్ధం చేసే మొనగాడిలా
అరుస్తూ హంగామా చేసింది !    

ఆగరా చాలుచాలు , సిగ్గుచేటు
అంటూ ఒక జాతి కుక్క అడ్డుపడింది .

ఏనుగుతో  సాలగలవురా నువ్వు ? 
 ఎలాగ నీ గొంతుక  బొంగురుపోయిందో చూడు . 
 నీ మొరుగులకి లక్ష్యపెట్టకుండా 
 ఏనుగు ఎంత  హుందాగా పోతుందో  చూడు .

జాతికుక్కకి ఊరకుక్క ఇలా 
 జవాబిచ్చింది

ఆ ! ఆ ! అదీ సంగతి ! 
ఏనుగుకి నా లక్ష్యం లేదు  
అందుకే నా కింత ధైర్యం ! 
నిజంగా పోరాడవలసి వస్తే 
నే నెప్పుడో తోక ముడిచేసి  ఉందును 

ఇప్పుడు ఊళ్లోని ఊరకుక్క లన్నీ  
నన్ను మెచ్చుకొంటాయి . 
 నా ధైర్య సాహసాలని కొనియాడతాయి. 
 ఏనుగు వెనకాతల ఈ కుక్క మొరిగిందని  
 నన్ను అభినందిస్తాయి !

క్రియోలోవ్  తాతయ్య  కథలు 
మహాకవి శ్రీశ్రీ  - ఖడ్గ సృష్టి



1 comments: