Tuesday, August 16, 2011

ఫిడేల్ కోసం పాట



పదపోదాం
ప్రభాతనల  ప్రవక్తా
మెలికలు తిరిగే దారులు దిగి
నీ ప్రేమాస్పదమైన ఆకుపచ్చ నేల  విముక్తికి
పద పోదాం

పగ తీర్చుకుందాం ఎన్నో అన్యాయాలమీద
మన ఫాలభాగాల  నిండా తిరుగుబాటు తారలు విజయమో మరణమో  అని ప్రమాణం చేస్తూ

తొలిసారి పేలిన తుపాకి గుండు చప్పుడికి
నిద్రాభంగం చెందిన బాలికలాగ  నేలతల్లి                   మేల్కొన్నప్పుడు
మేము నీ ప్రక్కనే ఉంటాం  ప్రశాంత సైనికులం
మేము నీ పక్కనే

భూసంస్కరణ  న్యాయం  తిండి స్వాతంత్ర్యం
అంటూ నీ గొంతుక నాలుగు గాలులకీ 
ప్రకటించేప్పుడు
మేం అక్కడే ఉంటాం  నీ పలుకుల్ని ప్రతిధ్వనిస్తూ
నీ పక్కనే ఉంటాం

గురి చూసి విమోచన కోసం పేల్చిన
మనగుండు దెబ్బకి
క్రూరమృగం డొక్కలో గాయపడినప్పుడు
మేం నీతోనే ఉంటాం గర్జించే  హృదయాలతో
మేం అక్కడే  ఉంటాం
వాళ్ళు మనల్ని  హడల కొడతారనుకోకు
లంచాలతో బిరుదాలతో



మాకు తుపాకీ  కావాలి
తూటాలు కావాలి   లాఠీ కావాలి                                               అంతే  రేం  వొద్దు


వాళ్ళ ఆయుధాలు మనల్ని ఊచకోత కొస్తే
క్యూబన్ కన్నీళ్లను మాత్రమే కోరుకుంటాం
చరిత్ర ప్రవాహంలో  కొట్టుకుపోతున్న వీరులకు కాటిగుడ్డల్లా  కప్పడానికి
అంతే  మరేమీ  అడిగేది లేదు .
                                                                                     
( రచన : చేగువేరా )
మహాకవి శ్రీ శ్రీ - మరోప్రస్థానం 

0 comments:

Post a Comment